అన్‌-న'హ్లు: తేనెటీగ. ఈ సూరహ్‌ చివరి మక్కహ్ కాలంలో అవతరింపజేయబడింది. విశ్వం లో ఉన్న ప్రతిదీ అల్లాహ్‌ (సు.త.)ను స్తుతిస్తుంది. మానవునికి ప్రకృతి మీద ఆధిక్యత ఇవ్వబడింది. అతడు, అల్లాహ్‌ (సు.త.) అద్వితీయతను మరియు సత్యాన్ని గుర్తించాలని దీని సారాంశం. అల్లాహ్‌ (సు.త.) ప్రతి దానిని ఒక ఉద్దేశ్యంతో ఒక ప్రయోజనం కొరకు పుట్టించాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండాలి. తోటివారితో న్యాయం మరియు ఉదారస్వభావంతో వర్తించాలి. అల్లాహ్‌ (సు.త.) నిషేధించినట్టి, పాపం, చెడు, అసహ్యకరమైన, అశ్లీకరమైన పనుల నుండి దూరంగా ఉండాలి. 128 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 68వ ఆయత్‌ నుండి తీసుకోబడింది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

أَتَىٰ أَمْرُ اللَّـهِ فَلَا تَسْتَعْجِلُوهُ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ١

* అల్లాహ్‌ ఆజ్ఞ (తీర్పు) వచ్చింది! కావున మీరు దాని కొరకు తొందరపెట్టకండి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు సాటి కల్పించే భాగ స్వాములకు అత్యున్నతుడు.


يُنَزِّلُ الْمَلَائِكَةَ بِالرُّوحِ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ أَنْ أَنذِرُوا أَنَّهُ لَا إِلَـٰهَ إِلَّا أَنَا فَاتَّقُونِ ٢

ఆయనే, తన ఆజ్ఞతో, దేవదూతల ద్వారా, దివ్యజ్ఞానాన్ని (రూ'హ్‌ను) 1 తానుకోరిన, తన దాసులపై అవత రింపజేస్తాడు, 2 వారిని (ప్రజలను) ఇలా హెచ్చరించటానికి: ''నిశ్చయంగా, నేను తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు! కావున మీరు నా యందే భయ భక్తులు కలిగి ఉండండి!''


خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ تَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ ٣

ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు. వారు, ఆయనకు సాటికల్పించే భాగస్వాములకంటే (షరీక్‌లకంటే) ఆయన అత్యున్నతుడు. 3


خَلَقَ الْإِنسَانَ مِن نُّطْفَةٍ فَإِذَا هُوَ خَصِيمٌ مُّبِينٌ ٥

ఆయన మానవుణ్ణి వీర్య (ఇంద్రియ) బిందువుతో సృష్టించాడు, తరువాత ఆ వ్యక్తియే ఒక బహిరంగ వివాదిగా మారిపోతాడు.


وَالْأَنْعَامَ خَلَقَهَا ۗ لَكُمْ فِيهَا دِفْءٌ وَمَنَافِعُ وَمِنْهَا تَأْكُلُونَ ٥

మరియు ఆయన పశువులను సృష్టించాడు. వాటిలో మీ కొరకు వెచ్చని దుస్తులు మరియు అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరియు వాటిలో (కొన్నిటి మాంసం) మీరు తింటారు.


وَلَكُمْ فِيهَا جَمَالٌ حِينَ تُرِيحُونَ وَحِينَ تَسْرَحُونَ ٦

మరియు వాటిని మీరు సాయంత్రం ఇండ్లకు తోలుకొని వచ్చేటప్పుడు మరియు ఉదయం మేపటానికి తోలుకొని పోయేటప్పుడు, వాటిలో మీకొక మనోహరమైన దృశ్యం ఉంది.


وَتَحْمِلُ أَثْقَالَكُمْ إِلَىٰ بَلَدٍ لَّمْ تَكُونُوا بَالِغِيهِ إِلَّا بِشِقِّ الْأَنفُسِ ۚ إِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ٧

మరియు అవి మీ బరువును మోసుకొని – మీరు ఎంతో శ్రమపడనిదే చేరుకోలేని ప్రాంతాలకు – తీసుకుపోతాయి. నిశ్చయంగా, మీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణాప్రదాత.


وَالْخَيْلَ وَالْبِغَالَ وَالْحَمِيرَ لِتَرْكَبُوهَا وَزِينَةً ۚ وَيَخْلُقُ مَا لَا تَعْلَمُونَ ٨

మరియు ఆయన గుర్రాలను, 4 కంచర గాడిదలను మరియు గాడిదలను, మీరు స్వారీ చేయటానికి మరియు మీ శోభను పెంచటానికి సృష్టించాడు. మరియు ఆయన, మీకు తెలియనివి (అనేక ఇతర సాధనాలను) కూడా సృష్టిస్తాడు. 5


وَعَلَى اللَّـهِ قَصْدُ السَّبِيلِ وَمِنْهَا جَائِرٌ ۚ وَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ ٩

మరియు సన్మార్గం చూపటమే అల్లాహ్‌ విధానం 6 మరియు అందులో (లోకంలో) తప్పుడు (వక్ర) మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన తలచుకొని ఉంటే మీ రందరికీ సన్మార్గం చూపి ఉండే వాడు. 7


هُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً ۖ لَّكُم مِّنْهُ شَرَابٌ وَمِنْهُ شَجَرٌ فِيهِ تُسِيمُونَ ١٠

ఆయనే, ఆకాశం నుండి మీ కొరకు నీళ్ళను కురిపిస్తాడు. దాని నుండి మీకు త్రాగటానికి నీరు దొరుకుతుంది మరియు మీ పశువులను మేపటానికి పచ్చిక పెరుగుతుంది.


يُنبِتُ لَكُم بِهِ الزَّرْعَ وَالزَّيْتُونَ وَالنَّخِيلَ وَالْأَعْنَابَ وَمِن كُلِّ الثَّمَرَاتِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ١١

ఆయన దీనిద్వారా (నీటి ద్వారా) మీకొరకు పంటలను, 'జైతూన్‌ మరియు ఖర్జూరపు వృక్షాలను, ద్రాక్ష మరియు ఇతర రకాల ఫలాలను పండింపజేస్తున్నాడు. నిశ్చయంగా ఆలోచించే వారికి ఇందులో ఒక సూచన (నిదర్శనం) ఉంది.


وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ وَالشَّمْسَ وَالْقَمَرَ ۖ وَالنُّجُومُ مُسَخَّرَاتٌ بِأَمْرِهِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يَعْقِلُونَ ١٢

మరియు ఆయనే రేయింబవళ్ళను మరియు సూర్య-చంద్రులను, మీకు ఉపయుక్త మైనవిగాచేశాడు. మరియు నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞతోనే మీకు ఉపయుక్తమైనవిగా చేయబడ్డాయి. 8 నిశ్చయంగా, బుద్ధిని ఉపయోగించే వారికి వీటిలో సూచనలు (నిదర్శనాలు) ఉన్నాయి.


وَمَا ذَرَأَ لَكُمْ فِي الْأَرْضِ مُخْتَلِفًا أَلْوَانُهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَذَّكَّرُونَ ١٣

మరియు ఆయన మీ కొరకు భూమిలో వివిధ రంగుల వస్తువులను ఉత్పత్తి (వ్యాపింప) జేశాడు. నిశ్చ యంగా, హితబోధ స్వీకరించేవారికి వీటిలో సూచన ఉంది.


وَهُوَ الَّذِي سَخَّرَ الْبَحْرَ لِتَأْكُلُوا مِنْهُ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُوا مِنْهُ حِلْيَةً تَلْبَسُونَهَا وَتَرَى الْفُلْكَ مَوَاخِرَ فِيهِ وَلِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ ١٤

మరియు ఆయన సముద్రాన్ని – తాజా మాంసము తినటానికి మరియు మీరు ధరించే ఆభరణాలు తీయటానికి – మీకు ఉపయుక్త మైనదిగా చేశాడు. ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి (ప్రజలు), అందులో ఓడల మీద దాని నీటిని చీల్చుకొని పోవటాన్ని నీవు చూస్తున్నావు. మరియు బహుశా మీరు కృతజ్ఞులవుతారని ఆయన మీకు (ఇవన్నీ ప్రసాదించాడు).


وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ ١٥

మరియు భూమి మీతోపాటు చలించకుండా ఉండటానికి, ఆయన దానిలో స్థిరమైన పర్వ తాలను నాటాడు 9 మరియు అందులో నదులను ప్రవహింపజేశాడు. మరియు రహదారులను నిర్మించాడు, బహుశా మీరు మార్గం పొందుతారని!


وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ ١٦

మరియు (భూమిలో మార్గంచూపే) సంకేతా లను పెట్టాడు. మరియు వారు (ప్రజలు) నక్షత్రాల ద్వారా కూడా తమ మార్గాలు తెలుసుకుంటారు.


أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ ١٧

సృష్టించేవాడూ, అసలు ఏమీ సృష్టించలేని వాడూసమానులా? ఇది మీరెందుకు గమనించరు?


وَإِن تَعُدُّوا نِعْمَةَ اللَّـهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ اللَّـهَ لَغَفُورٌ رَّحِيمٌ ١٨

మరియు మీరు అల్లాహ్‌ అనుగ్రహాలను లెక్కపెట్టదలచినా, మీరు వాటిని లెక్కపెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.


وَاللَّـهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ ١٩

మరియు అల్లాహ్‌కు మీరు దాచేవి మరియు మీరు వెలిబుచ్చేవి అన్నీతెలుసు.


وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّـهِ لَا يَخْلُقُونَ شَيْئًا وَهُمْ يُخْلَقُونَ ٢٠

మరియు ఎవరినైతే వారు (ప్రజలు), అల్లాహ్‌ను వదలి ప్రార్థిస్తున్నారో, వారు ఏమీ సృష్టించలేరు మరియు స్వయంగా వారే సృష్టించ బడి ఉన్నారు.


أَمْوَاتٌ غَيْرُ أَحْيَاءٍ ۖ وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ ٢١

వారు (ఆ దైవాలు) మృతులు, ప్రాణంలేని వారు. 10 మరియు వారికి, తాము తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా తెలియదు.


إِلَـٰهُكُمْ إِلَـٰهٌ وَاحِدٌ ۚ فَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ قُلُوبُهُم مُّنكِرَةٌ وَهُم مُّسْتَكْبِرُونَ ٢٢

మీ ఆరాధ్యదైవం కేవలం (అల్లాహ్‌) ఒక్కడే! పరలోక జీవితాన్ని విశ్వసించనివారి హృదయాలు (ఈ సత్యాన్ని) తిరస్కరిస్తున్నాయి మరియు వారు దురహంకారంలో పడి ఉన్నారు. 11


لَا جَرَمَ أَنَّ اللَّـهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْتَكْبِرِينَ ٢٣

నిస్సందేహంగా, వారి రహస్య విషయాలు మరియు వారి బహిరంగ విషయాలు అన్నీ, నిశ్చయంగా అల్లాహ్‌కు తెలుసు. నిశ్చయంగా, దురహంకారులంటే 12 ఆయన ఇష్టపడడు.


وَإِذَا قِيلَ لَهُم مَّاذَا أَنزَلَ رَبُّكُمْ ۙ قَالُوا أَسَاطِيرُ الْأَوَّلِينَ ٢٤

మరియు: ''మీ ప్రభువు ఏమి అవతరింప జేశాడు?'' అని వారిని అడిగినప్పుడు, వారు: ''అవి పూర్వకాలపు కల్పిత గాథలు మాత్రమే!'' అని జవాబిస్తారు.


لِيَحْمِلُوا أَوْزَارَهُمْ كَامِلَةً يَوْمَ الْقِيَامَةِ ۙ وَمِنْ أَوْزَارِ الَّذِينَ يُضِلُّونَهُم بِغَيْرِ عِلْمٍ ۗ أَلَا سَاءَ مَا يَزِرُونَ ٢٥

కావున పునరుత్థానదినమున వారు తమ (పాపాల) భారాలను పూర్తిగా మరియు తాము మార్గం తప్పించిన అజ్ఞానుల భారాలలోని కొంత భాగాన్ని కూడా మోస్తారు. 13 వారు మోసే భారం ఎంత దుర్భరమైనదో చూడండి!


قَدْ مَكَرَ الَّذِينَ مِن قَبْلِهِمْ فَأَتَى اللَّـهُ بُنْيَانَهُم مِّنَ الْقَوَاعِدِ فَخَرَّ عَلَيْهِمُ السَّقْفُ مِن فَوْقِهِمْ وَأَتَاهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ ٢٦

వాస్తవానికి, వారికంటే పూర్వం గతించిన వారు కూడా (అల్లాహ్‌ సందేశాలకు వ్యతిరేకంగా) కుట్రలు పన్నారు. కాని అల్లాహ్‌ వారి (పన్నాగపు) కట్టడాలను వాటి పునాదులతో సహా పెకలించాడు. దానితో వాటి కప్పులు వారి మీద పడ్డాయి మరియు వారిపై, వారు ఊహించని వైపునుండి శిక్ష వచ్చిపడింది.


ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يُخْزِيهِمْ وَيَقُولُ أَيْنَ شُرَكَائِيَ الَّذِينَ كُنتُمْ تُشَاقُّونَ فِيهِمْ ۚ قَالَ الَّذِينَ أُوتُوا الْعِلْمَ إِنَّ الْخِزْيَ الْيَوْمَ وَالسُّوءَ عَلَى الْكَافِرِينَ ٢٧

తరువాత పునరుత్థానదినమున ఆయన వారిని అవమానపరుస్తాడు మరియు వారిని అడుగుతాడు: ''మీరు నాకు సాటి కల్పించిన వారు – ఎవరిని గురించి అయితే మీరు (విశ్వాసులతో) వాదులాడేవారో – ఇప్పుడు ఎక్కడున్నారు?'' జ్ఞానం ప్రసాదించబడినవారు అంటారు: ''నిశ్చయంగా ఈ రోజు అవమానం మరియు దుర్దశ సత్య-తిరస్కారుల కొరకే!


الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ ظَالِمِي أَنفُسِهِمْ ۖ فَأَلْقَوُا السَّلَمَ مَا كُنَّا نَعْمَلُ مِن سُوءٍ ۚ بَلَىٰ إِنَّ اللَّـهَ عَلِيمٌ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٢٨

''వారిపై, ఎవరైతే తమను తాము దుర్మార్గం లో ముంచుకొని ఉన్నప్పుడు, దేవదూతలు వారి ప్రాణాలు తీస్తారో!'' అప్పుడు వారు (సత్య-తిరస్కా రులు) లొంగిపోయి: ''మేము ఎలాంటి పాపం చేయలేదు.'' 14 అని అంటారు. (దేవదూతలు వారితో ఇలాఅంటారు): ''అలాకాదు! నిశ్చయంగా మీరు చేసేదంతా అల్లాహ్‌ కు బాగా తెలుసు.


فَادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَلَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ ٢٩

''కావున నరక ద్వారాలలో ప్రవేశించండి. అక్కడ శాశ్వతంగా ఉండటానికి! గర్విష్ఠులకు లభించే నివాసం ఎంత చెడ్డది!'' (3/8)


وَقِيلَ لِلَّذِينَ اتَّقَوْا مَاذَا أَنزَلَ رَبُّكُمْ ۚ قَالُوا خَيْرًا ۗ لِّلَّذِينَ أَحْسَنُوا فِي هَـٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۚ وَلَدَارُ الْآخِرَةِ خَيْرٌ ۚ وَلَنِعْمَ دَارُ الْمُتَّقِينَ ٣٠

* మరియు దైవభీతి గలవారితో: ''మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?'' అని అడిగి నప్పుడు, వారు: ''అత్యుత్తమమైనది.'' అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీని కంటే ఉత్తమమైనది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది.


جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ لَهُمْ فِيهَا مَا يَشَاءُونَ ۚ كَذَٰلِكَ يَجْزِي اللَّـهُ الْمُتَّقِينَ ٣١

వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్‌ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు.


الَّذِينَ تَتَوَفَّاهُمُ الْمَلَائِكَةُ طَيِّبِينَ ۙ يَقُولُونَ سَلَامٌ عَلَيْكُمُ ادْخُلُوا الْجَنَّةَ بِمَا كُنتُمْ تَعْمَلُونَ ٣٢

ఎవరైతే, పరిశుద్ధులుగా ఉండగా దైవ దూతలు వారి ప్రాణాలు తీస్తారో, వారితో: ''మీకు శాంతి కలుగుగాక (సలాం)! మీరు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా స్వర్గంలో ప్రవేశించండి!'' అని అంటారు. 15


هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ أَمْرُ رَبِّكَ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّـهُ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ٣٣

ఏమీ? వారు (సత్య-తిరస్కారులు), తమ వద్దకు దేవదూతల రాకకోసం ఎదురు చూస్తున్నారా? లేక నీ ప్రభువు ఆజ్ఞ (తీర్పు) కొసం ఎదురుచూస్తున్నారా? 16 వారికి పూర్వం ఉన్న వారు కూడా ఈ విధంగానే ప్రవర్తించారు. మరియు అల్లాహ్‌ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.


فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ ٣٤

అప్పుడు వారి దుష్కర్మల ఫలితాలు వారిపై పడ్డాయి మరియు వారు దేనిని గురించి పరిహాసమాడుతూ ఉన్నారో, అదే వారిని క్రమ్ముకుంది. 17


وَقَالَ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّـهُ مَا عَبَدْنَا مِن دُونِهِ مِن شَيْءٍ نَّحْنُ وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن دُونِهِ مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى الرُّسُلِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ ٣٥

మరియు (అల్లాహ్‌కు) సాటికల్పించేవారు అంటారు: ''ఒకవేళ అల్లాహ్‌ కోరి ఉంటే! మేము గానీ మా తండ్రి-తాతలు గానీ, ఆయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించేవారం కాదు. మరియు ఆయన ఆజ్ఞలేనిదే మేము దేన్ని కూడా నిషేధించే వారం కాదు.'' 18 వారికి పూర్వం వారు కూడా ఇలాగేచేశారు.అయితే ప్రవక్తల బాధ్యత (అల్లాహ్‌) సందేశాన్ని స్పష్టంగా అందజేయటం తప్ప ఇంకేమిటి?


وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَّسُولًا أَنِ اعْبُدُوا اللَّـهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ ۖ فَمِنْهُم مَّنْ هَدَى اللَّـهُ وَمِنْهُم مَّنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ ۚ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ ٣٦

మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అత నన్నాడు): ''మీరు అల్లాహ్‌ను మాత్రమే ఆరాధిం చండి. మరియు మిథ్యదైవాల ('తాగూత్‌ల) ఆరాధనను త్యజించండి.'' వారిలో కొందరికి అల్లాహ్‌ సన్మార్గం చూపాడు, మరి కొందరి కొరకు మార్గభ్రష్టత్వం నిశ్చితమైపోయింది. కావున మీరు భూమిలో సంచారం చేసి చూడండి, ఆ సత్య-తిరస్కారుల గతి ఏమయిందో!


إِن تَحْرِصْ عَلَىٰ هُدَاهُمْ فَإِنَّ اللَّـهَ لَا يَهْدِي مَن يُضِلُّ ۖ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ ٣٧

ఇక (ఓ ము'హమ్మద్‌!) నీవు వారిని సన్మార్గానికి తేవాలని ఎంత కోరుకున్నా! నిశ్చయంగా, అల్లాహ్‌ మార్గభ్రష్టతకు గురిచేసిన వానికి సన్మార్గం చూపడు. 19 వారికి సహాయపడే వారు ఎవ్వరూ ఉండరు.


وَأَقْسَمُوا بِاللَّـهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ لَا يَبْعَثُ اللَّـهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَـٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ ٣٨

మరియు వారు అల్లాహ్‌ పేరుతో దృఢమైన శపథం చేసి ఇలా అంటారు: ''మరణించిన వానిని అల్లాహ్‌ తిరిగి బ్రతికించిలేపడు!'' ఎందుకు లేపడు! ఆయన చేసిన వాగ్దానం సత్యం! అయినా చాలా మంది ప్రజలకు ఇది తెలియదు (కాని అది జరిగి తీరుతుంది);


لِيُبَيِّنَ لَهُمُ الَّذِي يَخْتَلِفُونَ فِيهِ وَلِيَعْلَمَ الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ كَانُوا كَاذِبِينَ ٣٩

వారు వాదిస్తూ ఉండిన దానిని గురించి వారికి తెలుపటానికి మరియు సత్యతిరస్కారులు తాము నిశ్చయంగా, అబద్ధమాడుతున్నారని తెలుసుకోవటానికి.


إِنَّمَا قَوْلُنَا لِشَيْءٍ إِذَا أَرَدْنَاهُ أَن نَّقُولَ لَهُ كُن فَيَكُونُ ٤٠

నిశ్చయంగా మేము ఏదైనావస్తువును ఉనికి లోనికి తీసుకురాదలచినపుడు దానిని మేము: ''అయిపో!'' అని ఆజ్ఞాపిస్తాము. అంతే! అది అయి పోతుంది. 20


وَالَّذِينَ هَاجَرُوا فِي اللَّـهِ مِن بَعْدِ مَا ظُلِمُوا لَنُبَوِّئَنَّهُمْ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَلَأَجْرُ الْآخِرَةِ أَكْبَرُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ ٤١

మరియు దౌర్జన్యాన్ని సహించిన తరువాత, ఎవరైతే అల్లాహ్‌ కొరకు వలసపోతారో; 21 అలాంటి వారికి మేము ప్రపంచంలో తప్పకుండా మంచి స్థానాన్ని నొసంగుతాము. మరియు వారి పరలోక ప్రతిఫలం దాని కంటే గొప్పగా ఉంటుంది. ఇది వారు తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది!


الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٤٢

అలాంటివారే సహనం వహించినవారు మరియు తమ ప్రభువును నమ్ముకున్నవారు.


وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ إِلَّا رِجَالًا نُّوحِي إِلَيْهِمْ ۚ فَاسْأَلُوا أَهْلَ الذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ ٤٣

మరియు (ఓ ము'హమ్మద్‌!) నీకు పూర్వం కూడా మేము పంపిన ప్రవక్తలందరూ పురుషులే (మానవులే)! 22 మేము వారిపై దివ్యజ్ఞానాన్ని (వ'హీని) అవతరింపజేశాము. కావున ఇది మీకు తెలియక పోతే పూర్వగ్రంథ ప్రజలను అడగండి.


بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ ۗ وَأَنزَلْنَا إِلَيْكَ الذِّكْرَ لِتُبَيِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ إِلَيْهِمْ وَلَعَلَّهُمْ يَتَفَكَّرُونَ ٤٤

(పూర్వపు ప్రవక్తలను) మేము స్పష్టమైన నిదర్శనాలతో మరియు గ్రంథాలతో ('జుబుర్‌ లతో) పంపాము. మరియు (ఓ ప్రవక్తా!) ఇప్పుడు ఈ జ్ఞాపికను (గ్రంథాన్ని) నీపై అవతరింపజేసింది, వారి వద్దకు అవతరింపజేయబడిన దానిని వారికి నీవు స్పష్టంగా వివరించటానికి మరియు బహుశా వారు ఆలోచిస్తారేమోనని!


أَفَأَمِنَ الَّذِينَ مَكَرُوا السَّيِّئَاتِ أَن يَخْسِفَ اللَّـهُ بِهِمُ الْأَرْضَ أَوْ يَأْتِيَهُمُ الْعَذَابُ مِنْ حَيْثُ لَا يَشْعُرُونَ ٤٥

దుష్ట పన్నాగాలు చేస్తున్నవారు – అల్లాహ్‌ తమను భూమిలోనికి దిగిపోయినట్లు చేయకుండా, లేదా తాము ఊహించనివైపు నుండి తమపై శిక్ష అవతరింపజేయకుండా – తాము సురక్షితంగా ఉన్నారనుకొంటున్నారా ఏమిటి?


أَوْ يَأْخُذَهُمْ فِي تَقَلُّبِهِمْ فَمَا هُم بِمُعْجِزِينَ ٤٦

లేదా వారు తిరుగాడుతున్నపుడు, అకస్మాత్తుగా ఆయన వారిని పట్టుకుంటే, వారు ఆయన (పట్టు) నుండి తప్పించుకోగలరా?


أَوْ يَأْخُذَهُمْ عَلَىٰ تَخَوُّفٍ فَإِنَّ رَبَّكُمْ لَرَءُوفٌ رَّحِيمٌ ٤٧

లేదా, వారిని భయకంపితులు జేసి పట్టుకో వచ్చు కదా! కాని నిశ్చయంగా, నీ ప్రభువు మహా కనికరుడు, అపార కరుణాప్రదాత.


أَوَلَمْ يَرَوْا إِلَىٰ مَا خَلَقَ اللَّـهُ مِن شَيْءٍ يَتَفَيَّأُ ظِلَالُهُ عَنِ الْيَمِينِ وَالشَّمَائِلِ سُجَّدًا لِّلَّـهِ وَهُمْ دَاخِرُونَ ٤٨

ఏమీ? వారు అల్లాహ్‌ సృష్టించిన ప్రతి వస్తువునూ గమనించటం (చూడటం) లేదా? వాటి నీడలు కుడి వైపుకూ ఎడమవైపుకూ వంగుతూ ఉండి, అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ, ఎలా వినమ్రత చూపుతున్నాయో? 23


وَلِلَّـهِ يَسْجُدُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مِن دَابَّةٍ وَالْمَلَائِكَةُ وَهُمْ لَا يَسْتَكْبِرُونَ ٤٩

మరియు ఆకాశాలలోను మరియు భూమి లోను ఉన్న సమస్త ప్రాణులు మరియు దేవదూతలు అందరూ అల్లాహ్‌కు సాష్టాంగం (సజ్దా) చేస్తూ ఉంటారు. వారెన్నడూ (తమ ప్రభువు సన్నిధిలో) గర్వపడరు.


يَخَافُونَ رَبَّهُم مِّن فَوْقِهِمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ ۩ ٥٠

వారు తమపై నున్న ప్రభువునకు భయపడుతూ, తమకు ఆజ్ఞాపించిన విధంగా నడుచు కుంటారు. (1/2) (సజ్దా)


وَقَالَ اللَّـهُ لَا تَتَّخِذُوا إِلَـٰهَيْنِ اثْنَيْنِ ۖ إِنَّمَا هُوَ إِلَـٰهٌ وَاحِدٌ ۖ فَإِيَّايَ فَارْهَبُونِ ٥١

* మరియు అల్లాహ్‌ ఇలా ఆజ్ఞాపించాడు: ''(ఓ మానవులారా!) ఇద్దరిని ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్యదైవం ఆయన (అల్లాహ్‌) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి.'' 24


وَلَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَهُ الدِّينُ وَاصِبًا ۚ أَفَغَيْرَ اللَّـهِ تَتَّقُونَ ٥٢

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. 25 ఏమీ? మీరు అల్లాహ్‌ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?


وَمَا بِكُم مِّن نِّعْمَةٍ فَمِنَ اللَّـهِ ۖ ثُمَّ إِذَا مَسَّكُمُ الضُّرُّ فَإِلَيْهِ تَجْأَرُونَ ٥٣

మరియు మీకు లభించిన అనుగ్రహాలన్నీ కేవలం అల్లాహ్‌ నుండి వచ్చినవే. అంతేగాక మీకు ఆపదలు వచ్చినపుడు కూడా మీరు సహాయం కొరకు ఆయననే మొరపెట్టుకుంటారు కదా! 26


ثُمَّ إِذَا كَشَفَ الضُّرَّ عَنكُمْ إِذَا فَرِيقٌ مِّنكُم بِرَبِّهِمْ يُشْرِكُونَ ٥٤

తరువాత ఆయన మీ ఆపదలు తొలగించి నపుడు; మీలో కొందరు మీ ప్రభువుకు సాటి (షరీక్‌లను) కల్పించ సాగుతారు –


لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ ۚ فَتَمَتَّعُوا ۖ فَسَوْفَ تَعْلَمُونَ ٥٥

మేము చేసిన ఉపకారానికి కృతఘ్నతగా. సరే (కొంత కాలం) సుఖాలను అనుభవించండి. తరువాత మీరు తెలుసుకుంటారు. 27


وَيَجْعَلُونَ لِمَا لَا يَعْلَمُونَ نَصِيبًا مِّمَّا رَزَقْنَاهُمْ ۗ تَاللَّـهِ لَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَفْتَرُونَ ٥٦

మరియు మేము వారికిచ్చిన జీవనోపాధి నుండి కొంత భాగాన్ని, తాము ఏ మాత్రం ఎరుగని తమ (బూటకదైవాల) కొరకు నిర్ణయించు కుంటారు వారు 28 అల్లాహ్‌తోడు! మీరు కల్పిస్తున్న ఈ బూటక (కల్పిత) దైవాలను గురించి మీరు తప్పక ప్రశ్నింపబడతారు.


وَيَجْعَلُونَ لِلَّـهِ الْبَنَاتِ سُبْحَانَهُ ۙ وَلَهُم مَّا يَشْتَهُونَ ٥٧

మరియు వారు అల్లాహ్‌కేమో కుమార్తెలను అంటగడుతున్నారు – ఆయన సర్వలోపాలకు అతీతుడు – మరియు తమకేమో తాముకోరేది 29 (నిర్ణయించుకుంటారు).


وَإِذَا بُشِّرَ أَحَدُهُم بِالْأُنثَىٰ ظَلَّ وَجْهُهُ مُسْوَدًّا وَهُوَ كَظِيمٌ ٥٨

మరియు వారిలో ఎవడికైనా బాలిక (పుట్టిందనే) శుభవార్త అందజేస్తే; అతడి ముఖం నల్లబడిపోతుంది. మరియు అతడు తన క్రోధావేశాన్ని అణచుకోవటానికి ప్రయత్నిస్తాడు.


يَتَوَارَىٰ مِنَ الْقَوْمِ مِن سُوءِ مَا بُشِّرَ بِهِ ۚ أَيُمْسِكُهُ عَلَىٰ هُونٍ أَمْ يَدُسُّهُ فِي التُّرَابِ ۗ أَلَا سَاءَ مَا يَحْكُمُونَ ٥٩

తనకు ఇవ్వబడిన శుభవార్తను (అతడు) దుర్వార్తగా భావించి, తన జాతివారి నుండి దాక్కుంటూ తిరుగుతాడు. అవమానాన్ని భరించి దానిని (ఆ బాలికను) ఉంచుకోవాలా? లేక, దానిని మట్టిలో పూడ్చివేయాలా? అని ఆలోచిస్తాడు. చూడండి! వారి నిర్ణయం ఎంత దారుణమైనదో! 30


لِلَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ مَثَلُ السَّوْءِ ۖ وَلِلَّـهِ الْمَثَلُ الْأَعْلَىٰ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ ٦٠

ఎవరైతే పరలోకాన్నివిశ్వసించరో, వారే దుష్టులుగా పరిగణింపబడేవారు. మరియు అల్లాహ్‌ మాత్రమే సర్వోన్నతుడిగా పరిగణింప బడేవాడు. మరియు ఆయన సర్వ శక్తిమంతుడు, మహా వివేకవంతుడు.


وَلَوْ يُؤَاخِذُ اللَّـهُ النَّاسَ بِظُلْمِهِم مَّا تَرَكَ عَلَيْهَا مِن دَابَّةٍ وَلَـٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ لَا يَسْتَأْخِرُونَ سَاعَةً ۖ وَلَا يَسْتَقْدِمُونَ ٦١

మరియు ఒకవేళ అల్లాహ్‌ మానవులను – వారు చేసే దుర్మార్గానికి – పట్టుకోదలిస్తే, భూమిపై ఒక్క ప్రాణిని కూడ వదిలేవాడు కాదు. 31 కాని, ఆయన ఒక నిర్ణీతకాలం వరకు వారికి వ్యవధి నిస్తున్నాడు. ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుకగానీ మరియు ముందు గానీ కాలేరు. 32


وَيَجْعَلُونَ لِلَّـهِ مَا يَكْرَهُونَ وَتَصِفُ أَلْسِنَتُهُمُ الْكَذِبَ أَنَّ لَهُمُ الْحُسْنَىٰ ۖ لَا جَرَمَ أَنَّ لَهُمُ النَّارَ وَأَنَّهُم مُّفْرَطُونَ ٦٢

మరియు వారు తమకు ఇష్టంలేని దానిని అల్లాహ్‌ కొరకు నిర్ణయిస్తారు.''నిశ్చయంగా, వారికి ఉన్నదంతా శుభమే (మేలైనదే).'' అని వారి నాలు కలు అబద్ధం పలుకుతున్నాయి. నిస్సందేహంగా, వారు నరకాగ్ని పాలవుతారు. మరియు నిశ్చ యంగా వారందులోకి త్రోయబడి వదలబడతారు.


تَاللَّـهِ لَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَهُوَ وَلِيُّهُمُ الْيَوْمَ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ٦٣

అల్లాహ్‌ తోడు, (ఓ ప్రవక్తా!) వాస్తవానికి, నీకు పూర్వమున్న సమాజాలవారి వద్దకు, మేము ప్రవక్తలను పంపాము! కాని షై'తాన్‌ వారి (దుష్ట) కర్మలను వారికి మంచివిగా కనిపించేటట్లుచేశాడు. అదేవిధంగా ఈ నాడు కూడా, వాడు వారి స్నేహితుడిగా ఉన్నాడు. 33 మరియు వారికి బాధా కరమైన శిక్ష ఉంటుంది.


وَمَا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ إِلَّا لِتُبَيِّنَ لَهُمُ الَّذِي اخْتَلَفُوا فِيهِ ۙ وَهُدًى وَرَحْمَةً لِّقَوْمٍ يُؤْمِنُونَ ٦٤

మరియు మేము ఈ గ్రంథాన్ని(ఖుర్‌ఆన్‌ను) నీపై అవతరింపజేసింది, వారు విభేదాలకు గురిఅయిన విషయాన్ని వారికి, నీవు స్పష్టం చేయటానికీ మరియు విశ్వసించే జనుల కొరకు మార్గదర్శకత్వంగానూ మరియు కారుణ్యంగానూ ఉంచటానికి!


وَاللَّـهُ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَسْمَعُونَ ٦٥

మరియు అల్లాహ్‌ ఆకాశంనుండి నీటిని కురిపించి, దాని ద్వారా నిర్జీవంగా ఉన్న భూమిలో జీవంపోశాడు. నిశ్చయంగా, ఇందులో వినేవారికి సూచన ఉంది.


وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهِ مِن بَيْنِ فَرْثٍ وَدَمٍ لَّبَنًا خَالِصًا سَائِغًا لِّلشَّارِبِينَ ٦٦

మరియు నిశ్చయంగా మీకు పశువులలో ఒక గుణపాఠం ఉంది. వాటి కడుపులలో ఉన్న దానిని (పాలను) మేము మీకు త్రాగటానికి ఇస్తున్నాము. అది మలం మరియు రక్తముల మధ్యనున్న నిర్మలమైన (స్వచ్ఛమైన) పాలు, త్రాగేవారికి ఎంతో రుచికరమైనది.


وَمِن ثَمَرَاتِ النَّخِيلِ وَالْأَعْنَابِ تَتَّخِذُونَ مِنْهُ سَكَرًا وَرِزْقًا حَسَنًا ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَعْقِلُونَ ٦٧

మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు. 34 నిశ్చయంగా, ఇందులో బుధ్ధిమంతులకు సూచన ఉంది.


وَأَوْحَىٰ رَبُّكَ إِلَى النَّحْلِ أَنِ اتَّخِذِي مِنَ الْجِبَالِ بُيُوتًا وَمِنَ الشَّجَرِ وَمِمَّا يَعْرِشُونَ ٦٨

మరియు నీ ప్రభువు తేనెటీగకు ఈ విధంగా ఆదేశమిచ్చాడు: 35 ''నీవు కొండలలో, చెట్లలో మరియు మానవుల కట్టడాలలో నీ తెట్టెలను కట్టుకో!


ثُمَّ كُلِي مِن كُلِّ الثَّمَرَاتِ فَاسْلُكِي سُبُلَ رَبِّكِ ذُلُلًا ۚ يَخْرُجُ مِن بُطُونِهَا شَرَابٌ مُّخْتَلِفٌ أَلْوَانُهُ فِيهِ شِفَاءٌ لِّلنَّاسِ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ٦٩

''తరువాత అన్నిరకాల ఫలాలను తిను. ఇలా నీ ప్రభువు మార్గాలపై నమ్రతతో నడువు.'' దాని కడుపు నుండి. రంగురంగుల పానకం (తేనే) ప్రసవిస్తుంది; అందులో మానవులకు వ్యాధి నివారణ ఉంది. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి సూచన ఉంది.


وَاللَّـهُ خَلَقَكُمْ ثُمَّ يَتَوَفَّاكُمْ ۚ وَمِنكُم مَّن يُرَدُّ إِلَىٰ أَرْذَلِ الْعُمُرِ لِكَيْ لَا يَعْلَمَ بَعْدَ عِلْمٍ شَيْئًا ۚ إِنَّ اللَّـهَ عَلِيمٌ قَدِيرٌ ٧٠

మరియు అల్లాహ్‌యే మిమ్మల్ని సృష్టించాడు, తరువాత మిమ్మల్ని మరణింప జేస్తాడు. మరియు మీలో కొందరు అతి నికృష్టమైన (ముసలి) వయస్సుకు చేరుతారు. అప్పుడు అతడు అంతా తెలిసినా, ఏమీ తెలియని వాడిగా అయిపోతాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు.


وَاللَّـهُ فَضَّلَ بَعْضَكُمْ عَلَىٰ بَعْضٍ فِي الرِّزْقِ ۚ فَمَا الَّذِينَ فُضِّلُوا بِرَادِّي رِزْقِهِمْ عَلَىٰ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَهُمْ فِيهِ سَوَاءٌ ۚ أَفَبِنِعْمَةِ اللَّـهِ يَجْحَدُونَ ٧١

మరియు అల్లాహ్‌ జీవనోపాధి విషయంలో మీలో కొందరికి మరికొందరిపై ఆధిక్యతను ప్రసా దించాడు. కాని ఈ ఆధిక్యత ఇవ్వబడినవారు తమ జీవనోపాధిని తమ ఆధీనంలో ఉన్నవారికి (బానిస లకు) ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే వారు తమతో సమానులు అవుతారేమోనని! ఏమీ? వారు అల్లాహ్‌ అనుగ్రహాన్ని తిరస్కరిస్తున్నారా?


وَاللَّـهُ جَعَلَ لَكُم مِّنْ أَنفُسِكُمْ أَزْوَاجًا وَجَعَلَ لَكُم مِّنْ أَزْوَاجِكُم بَنِينَ وَحَفَدَةً وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَتِ اللَّـهِ هُمْ يَكْفُرُونَ ٧٢

మరియు అల్లాహ్‌ మీ వంటి వారి నుండియే మీ సహవాసులను (అ'జ్వాజ్‌లను) పుట్టించాడు. మరియు మీ సహవాసుల నుండి మీకు పిల్లలను మరియు మనమళ్ళను ప్రసాదించి, మీకు ఉత్తమమైన జీవనోపాధులను కూడా సమకూర్చాడు. అయినా వారు (మానవులు) అసత్యమైన వాటిని (దైవాలుగా) విశ్వసించి, అల్లాహ్‌ అనుగ్రహాలను తిరస్కరిస్తారా?


وَيَعْبُدُونَ مِن دُونِ اللَّـهِ مَا لَا يَمْلِكُ لَهُمْ رِزْقًا مِّنَ السَّمَاوَاتِ وَالْأَرْضِ شَيْئًا وَلَا يَسْتَطِيعُونَ ٧٣

మరియు వారు అల్లాహ్‌ను వదలి, ఆకాశాల నుండి గానీ, భూమినుండి గానీ వారికి ఎలాంటి జీవనోపాధిని సమకూర్చలేని మరియు కనీసం (సమకూర్చే) సామర్థ్యం కూడా లేని వారిని ఆరాధిస్తున్నారు.


فَلَا تَضْرِبُوا لِلَّـهِ الْأَمْثَالَ ۚ إِنَّ اللَّـهَ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ ٧٤

కావున అల్లాహ్‌కు పోలికలు కల్పించకండి. 36 నిశ్చయంగా, అల్లాహ్‌కు అంతా తెలుసు మరియు మీకేమీ తెలియదు. (5/8)


ضَرَبَ اللَّـهُ مَثَلًا عَبْدًا مَّمْلُوكًا لَّا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَمَن رَّزَقْنَاهُ مِنَّا رِزْقًا حَسَنًا فَهُوَ يُنفِقُ مِنْهُ سِرًّا وَجَهْرًا ۖ هَلْ يَسْتَوُونَ ۚ الْحَمْدُ لِلَّـهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٧٥

* అల్లాహ్‌ ఒక ఉపమానం ఇచ్చాడు: ఒకడు బానిసగా ఇతరుని యాజమాన్యంలో ఉన్నవాడు. అతడు ఏ విధమైన అధికారం లేనివాడు, మరొకడు మా నుండి మంచి జీవనోపాధి పొందినవాడు. అతడు దానిలో నుండి రహస్యంగాను మరియు బహిరంగంగాను ఖర్చుచేయగలవాడు. ఏమీ? వీరిద్దరు సమానులవుతారా? సర్వ స్తోత్రాలకు అర్హుడు కేవలం అల్లాహ్‌ మాత్రమే! కానీ, చాలా మందికి ఇది తెలియదు.


وَضَرَبَ اللَّـهُ مَثَلًا رَّجُلَيْنِ أَحَدُهُمَا أَبْكَمُ لَا يَقْدِرُ عَلَىٰ شَيْءٍ وَهُوَ كَلٌّ عَلَىٰ مَوْلَاهُ أَيْنَمَا يُوَجِّههُّ لَا يَأْتِ بِخَيْرٍ ۖ هَلْ يَسْتَوِي هُوَ وَمَن يَأْمُرُ بِالْعَدْلِ ۙ وَهُوَ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ٧٦

అల్లాహ్‌ ఇద్దరు పురుషుల, మరొక ఉపమానం ఇచ్చాడు: వారిలో ఒకడు మూగవాడు, అతడు ఏమీ చేయలేడు, అతడు తన యజమానికి భారమై ఉన్నాడు. అతనిని ఎక్కడికి పంపినా మేలైనపని చేయలేడు. ఏమీ? ఇటువంటి వాడు మరొకనితో – ఎవడైతే న్యాయాన్ని పాటిస్తూ, ఋజుమార్గంపై నడుస్తున్నాడో – సమానుడు కాగలడా? 37


وَلِلَّـهِ غَيْبُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَمَا أَمْرُ السَّاعَةِ إِلَّا كَلَمْحِ الْبَصَرِ أَوْ هُوَ أَقْرَبُ ۚ إِنَّ اللَّـهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ ٧٧

మరియు ఆకాశాలలోనూ మరియు భూమి లోనూ ఉన్న అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్‌ కు మాత్రమే ఉంది. అంతిమ గడియ కేవలం రెప్పపాటు కాలంలో లేదా అంతకు ముందే సంభవించ వచ్చు! నిశ్చయంగా, అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.


وَاللَّـهُ أَخْرَجَكُم مِّن بُطُونِ أُمَّهَاتِكُمْ لَا تَعْلَمُونَ شَيْئًا وَجَعَلَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۙ لَعَلَّكُمْ تَشْكُرُونَ ٧٨

మరియు అల్లాహ్‌, మిమ్మల్ని మీతల్లుల గర్భాల నుండి, బయటికితీశాడు (పుట్టించాడు) అప్పుడు మీకేమీ తెలియదు. మరియు మీకు వినికిడినీ, దృష్టినీ మరియు హృదయాలను ప్రసాదించాడు. బహుశా మీరు కృతజ్ఞులై ఉంటారని. 38


أَلَمْ يَرَوْا إِلَى الطَّيْرِ مُسَخَّرَاتٍ فِي جَوِّ السَّمَاءِ مَا يُمْسِكُهُنَّ إِلَّا اللَّـهُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ ٧٩

ఏమీ? వారు పక్షులను ఆకాశం మధ్యలో తాటస్థ్య్థస్థ్తితిలో(పడిపోకుండా) ఎగురుతూ ఉండేది, గమనించడం లేదా? వాటిని అల్లాహ్‌ తప్ప ఇతరు లెవ్వరూ (ఆకాశంలో) నిలుపలేరు. నిశ్చయంగా ఇందులో విశ్వసించేవారికి సూచనలు ఉన్నాయి.


وَاللَّـهُ جَعَلَ لَكُم مِّن بُيُوتِكُمْ سَكَنًا وَجَعَلَ لَكُم مِّن جُلُودِ الْأَنْعَامِ بُيُوتًا تَسْتَخِفُّونَهَا يَوْمَ ظَعْنِكُمْ وَيَوْمَ إِقَامَتِكُمْ ۙ وَمِنْ أَصْوَافِهَا وَأَوْبَارِهَا وَأَشْعَارِهَا أَثَاثًا وَمَتَاعًا إِلَىٰ حِينٍ ٨٠

మరియు అల్లాహ్‌ మీకు, మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు. మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు (గుడారాలు) నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బసచేసి నప్పుడు, చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో, బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపకరణ సామాగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను (మీ కొరకు సృష్టించాడు).


وَاللَّـهُ جَعَلَ لَكُم مِّمَّا خَلَقَ ظِلَالًا وَجَعَلَ لَكُم مِّنَ الْجِبَالِ أَكْنَانًا وَجَعَلَ لَكُمْ سَرَابِيلَ تَقِيكُمُ الْحَرَّ وَسَرَابِيلَ تَقِيكُم بَأْسَكُمْ ۚ كَذَٰلِكَ يُتِمُّ نِعْمَتَهُ عَلَيْكُمْ لَعَلَّكُمْ تُسْلِمُونَ ٨١

మరియు అల్లాహ్‌ తాను సృష్టించిన వస్తువు లలో కొన్నింటిని నీడకొరకునియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పర చాడు. మరియు మీరు వేడినుండి కాపాడుకోవ టానికి వస్త్రాలను మరియు యుధ్ధంనుండి కాపాడు కోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని, ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తిచేస్తున్నాడు.


فَإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ الْمُبِينُ ٨٢

(ఓ ప్రవక్తా!) ఒకవేళ వారు వెనుదిరిగితే, నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే!


يَعْرِفُونَ نِعْمَتَ اللَّـهِ ثُمَّ يُنكِرُونَهَا وَأَكْثَرُهُمُ الْكَافِرُونَ ٨٣

వారు అల్లాహ్‌ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్యతిరస్కారులే!


وَيَوْمَ نَبْعَثُ مِن كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ ٨٤

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజం నుండి ఒక సాక్షిని లేపి నిలబెడ్తాము. అప్పుడు సత్య-తిరస్కారులకు ఏ విధమైన (సాకులు చెప్పటానికి) అనుమతి ఇవ్వబడదు 39 మరియు వారికి పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఇవ్వబడదు.


وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنظَرُونَ ٨٥

మరియు దుర్మార్గులు ఆ శిక్షను చూసినప్పుడు, అది వారి కొరకు తగ్గించడం జరుగదు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు. 40


وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَـٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِن دُونِكَ ۖ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ ٨٦

మరియు (అల్లాహ్‌కు) సాటి కల్పించిన వారు, తాము సాటిగా నిలిపిన వారిని చూసి అంటారు: ''ఓ మా ప్రభూ! వీరే మేము నీకు సాటి కల్పించి, నీకు బదులుగా ఆరాధించినవారు.'' కాని (సాటిగా నిలుపబడిన) వారు సాటి కల్పించిన వారి మాటలను వారి వైపుకే విసురుతూ అంటారు: ''నిశ్చయంగా, మీరు అసత్య వాదులు.'' 41


وَأَلْقَوْا إِلَى اللَّـهِ يَوْمَئِذٍ السَّلَمَ ۖ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ ٨٧

మరియు ఆ రోజు (అందరూ) వినమ్రులై తమను తాము అల్లాహ్‌కు అప్పగించుకుంటారు. వారు కల్పించినవి (దైవాలు) వారిని త్యజించి ఉంటాయి.


الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّـهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ ٨٨

ఎవరైతే సత్యాన్ని తిరస్కరించి (ప్రజలను) అల్లాహ్‌ మార్గం నుండి నిరోధించారో, వారికి మేము వారు చేస్తూఉండిన దౌర్జన్యాలకు, శిక్ష మీద శిక్ష విధిస్తాము. 42


وَيَوْمَ نَبْعَثُ فِي كُلِّ أُمَّةٍ شَهِيدًا عَلَيْهِم مِّنْ أَنفُسِهِمْ ۖ وَجِئْنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَـٰؤُلَاءِ ۚ وَنَزَّلْنَا عَلَيْكَ الْكِتَابَ تِبْيَانًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ ٨٩

మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతి రేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము 43 ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్‌కు విధేయులు (ముస్లింలు) అయినవారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి. (3/4)


إِنَّ اللَّـهَ يَأْمُرُ بِالْعَدْلِ وَالْإِحْسَانِ وَإِيتَاءِ ذِي الْقُرْبَىٰ وَيَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ وَالْبَغْيِ ۚ يَعِظُكُمْ لَعَلَّكُمْ تَذَكَّرُونَ ٩٠

* నిశ్చయంగా, అల్లాహ్‌ న్యాయం చేయ మని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. 44 ఆయన ఈ విధంగా మీకు బోధిస్తున్నాడు, బహుశా మీరు హితబోధ గ్రహిస్తారని.


وَأَوْفُوا بِعَهْدِ اللَّـهِ إِذَا عَاهَدتُّمْ وَلَا تَنقُضُوا الْأَيْمَانَ بَعْدَ تَوْكِيدِهَا وَقَدْ جَعَلْتُمُ اللَّـهَ عَلَيْكُمْ كَفِيلًا ۚ إِنَّ اللَّـهَ يَعْلَمُ مَا تَفْعَلُونَ ٩١

మరియు మీరు అల్లాహ్‌ పేరుతో వాగ్దానం చేస్తే మీ వాగ్దానాలను తప్పక నెరవేర్చండి. మరియు మీరు ప్రమాణాలను దృఢపరచిన తర్వాత భంగపరచకండి. 45 (ఎందుకంటే) వాస్తవానికి, మీరు అల్లాహ్‌ను మీకు జామీను దారుగా 46 చేసుకున్నారు. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్‌కు బాగా తెలుసు.


وَلَا تَكُونُوا كَالَّتِي نَقَضَتْ غَزْلَهَا مِن بَعْدِ قُوَّةٍ أَنكَاثًا تَتَّخِذُونَ أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ أَن تَكُونَ أُمَّةٌ هِيَ أَرْبَىٰ مِنْ أُمَّةٍ ۚ إِنَّمَا يَبْلُوكُمُ اللَّـهُ بِهِ ۚ وَلَيُبَيِّنَنَّ لَكُمْ يَوْمَ الْقِيَامَةِ مَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ ٩٢

మరియు మీరు ఆ స్త్రీ వలె కాకండి, ఏ స్త్రీ అయితే స్వయంగా కష్టపడి నూలువడికి గట్టి దారాన్ని చేసిన తరువాత దాన్ని ముక్కలు ముక్కలగా త్రెంచివేసిందో! ఒక వర్గంవారు మరొక వర్గంవారి కంటే అధికంగా ఉన్నారని, పరస్పరం మోసగించుకోవటానికి, మీ ప్రమాణాలను ఉపయో గించుకోకండి. నిశ్చయంగా అల్లాహ్‌ మిమ్మల్ని వీటి (ఈ ప్రమాణాల) ద్వారా పరీక్షిస్తున్నాడు. మరియు నిశ్చయంగా, పునరుత్థానదినమున ఆయన మీకు, మీరు వాదులాడే విషయాలను గురించి స్పష్టంగా తెలియజేస్తాడు.


وَلَوْ شَاءَ اللَّـهُ لَجَعَلَكُمْ أُمَّةً وَاحِدَةً وَلَـٰكِن يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَلَتُسْأَلُنَّ عَمَّا كُنتُمْ تَعْمَلُونَ ٩٣

ఒకవేళ అల్లాహ్‌ కోరితే మిమ్మల్ని అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. కాని ఆయన తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురిచేస్తాడు. మరియు తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. 47 మరియు నిశ్చయంగా, మీరు చేస్తున్న కర్మలను గురించి మీరు తప్పక ప్రశ్నించబడతారు.


وَلَا تَتَّخِذُوا أَيْمَانَكُمْ دَخَلًا بَيْنَكُمْ فَتَزِلَّ قَدَمٌ بَعْدَ ثُبُوتِهَا وَتَذُوقُوا السُّوءَ بِمَا صَدَدتُّمْ عَن سَبِيلِ اللَّـهِ ۖ وَلَكُمْ عَذَابٌ عَظِيمٌ ٩٤

మరియు మీ ప్రమాణాలను పరస్పరం మోసగించుకోవటానికి ఉపయోగించుకోకండి. అలా చేస్తే స్థిరపడిన పాదాలు జారిపోవచ్చు మరియు మీరు అల్లాహ్‌ మార్గం నుండి ప్రజలను నిరోధించిన పాపఫలితాన్ని రుచిచూడగలరు. 48 మరియు మీకు ఘోరమైన శిక్ష పడగలదు.


وَلَا تَشْتَرُوا بِعَهْدِ اللَّـهِ ثَمَنًا قَلِيلًا ۚ إِنَّمَا عِندَ اللَّـهِ هُوَ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ ٩٥

మరియు మీరు అల్లాహ్‌తో చేసిన వాగ్దానాన్ని స్వల్పలాభానికి అమ్ముకోకండి. మీరు తెలుసుకో గలిగితే, నిశ్చయంగా, అల్లాహ్‌ వద్ద ఉన్నదే మీకు ఎంతో మేలైనది.


مَا عِندَكُمْ يَنفَدُ ۖ وَمَا عِندَ اللَّـهِ بَاقٍ ۗ وَلَنَجْزِيَنَّ الَّذِينَ صَبَرُوا أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ ٩٦

మీ దగ్గర ఉన్నదంతా నశించేదే. మరియు అల్లాహ్‌ వద్ద ఉన్నదే (శాశ్వతంగా) మిగిలేది! మరియు మేము సహనం వహించేవారికి, వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.


مَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَلَنُحْيِيَنَّهُ حَيَاةً طَيِّبَةً ۖ وَلَنَجْزِيَنَّهُمْ أَجْرَهُم بِأَحْسَنِ مَا كَانُوا يَعْمَلُونَ ٩٧

ఏ పురుషుడూగానీ, లేక స్త్రీగానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. 49 మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.


فَإِذَا قَرَأْتَ الْقُرْآنَ فَاسْتَعِذْ بِاللَّـهِ مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ ٩٨

కావున నీవు ఖుర్‌ఆన్‌ పఠించబోయే టప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షై'తాన్‌ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్‌ శరణు వేడుకో! 50


إِنَّهُ لَيْسَ لَهُ سُلْطَانٌ عَلَى الَّذِينَ آمَنُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ ٩٩

విశ్వసించి, తమ ప్రభువును నమ్ముకున్న వారిపై నిశ్చయంగా, వాడికి ఎలాంటి అధికారం ఉండదు.


إِنَّمَا سُلْطَانُهُ عَلَى الَّذِينَ يَتَوَلَّوْنَهُ وَالَّذِينَ هُم بِهِ مُشْرِكُونَ ١٠٠

కాని! నిశ్చయంగా వాడి (షై'తాన్‌) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహంచేసుకునే) వారిపై 51 మరియు ఆయనకు (అల్లాహ్‌కు) సాటి కల్పించే వారిపై, వాడికి అధికారం ఉంటుంది.


وَإِذَا بَدَّلْنَا آيَةً مَّكَانَ آيَةٍ ۙ وَاللَّـهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوا إِنَّمَا أَنتَ مُفْتَرٍ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ١٠١

మరియు మేము ఒక సందేశాన్ని (ఆయత్‌ ను) మార్చి దాని స్థానంలో మరొక సందేశాన్ని అవతరింపజేసినప్పుడు; 52 తాను దేన్ని ఎప్పుడు అవతరింపజేశాడో అల్లాహ్‌కు బాగా తెలుసు. (అయినా) వారు (సత్య-తిరస్కారులు) ఇలా అంటారు: ''నిశ్చయంగా నీవే (ఓ ము'హమ్మద్‌!) దీనిని కల్పించేవాడవు.'' అసలు వారిలో చాలా మంది (యథార్థం) తెలుసుకోలేరు.


قُلْ نَزَّلَهُ رُوحُ الْقُدُسِ مِن رَّبِّكَ بِالْحَقِّ لِيُثَبِّتَ الَّذِينَ آمَنُوا وَهُدًى وَبُشْرَىٰ لِلْمُسْلِمِينَ ١٠٢

వారితో అను: ''దీనిని (ఈ ఖుర్‌ఆన్‌ను) నీ ప్రభువు వద్ద నుండి సత్యంతో, విశ్వాసులను (విశ్వాసంలో) పటిష్టం చేయటానికి మరియు (అల్లాహ్‌కు) సంపూర్ణంగా విధేయులుగా ఉన్న వారికి (ముస్లింలకు) సన్మార్గం చూపటానికి మరియు శుభవార్త అందజేయటానికి, పరిశుద్ధాత్మ (జిబ్రీల్) 53 క్రమక్రమంగా ఉన్నది ఉన్నట్లుగా తీసుకొనివచ్చాడు.''


وَلَقَدْ نَعْلَمُ أَنَّهُمْ يَقُولُونَ إِنَّمَا يُعَلِّمُهُ بَشَرٌ ۗ لِّسَانُ الَّذِي يُلْحِدُونَ إِلَيْهِ أَعْجَمِيٌّ وَهَـٰذَا لِسَانٌ عَرَبِيٌّ مُّبِينٌ ١٠٣

మరియు: ''నిశ్చయంగా, ఇతనికి ఒక మనిషి నేర్పుతున్నాడు.'' 54 అని, వారు అనే విషయం మాకు బాగా తెలుసు. వారు సూచించే (అపార్థం చేసే) వ్యక్తి భాష పరాయి భాష. కాని ఈ (ఖుర్‌ఆన్‌) భాష స్వచ్ఛమైన 'అరబ్బీ భాష. 55


إِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّـهِ لَا يَهْدِيهِمُ اللَّـهُ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١٠٤

నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్‌ సందేశాలను (ఆయాత్‌ లను) విశ్వసించరో! వారికి అల్లాహ్‌ సన్మార్గం చూపడు మరియు వారికి బాధాకర మైనశిక్ష ఉంటుంది.


إِنَّمَا يَفْتَرِي الْكَذِبَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِآيَاتِ اللَّـهِ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْكَاذِبُونَ ١٠٥

నిశ్చయంగా, అల్లాహ్‌ సూచనలను (ఆయాత్ లను) విశ్వసించని వారు, అబద్ధాలను కల్పిస్తున్నారు. మరియు అలాంటి వారు! వారే, అసత్యవాదులు.


مَن كَفَرَ بِاللَّـهِ مِن بَعْدِ إِيمَانِهِ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُ مُطْمَئِنٌّ بِالْإِيمَانِ وَلَـٰكِن مَّن شَرَحَ بِالْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ اللَّـهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ١٠٦

ఎవడైతే విశ్వసించిన తరువాత, అల్లాహ్‌ను తిరస్కరిస్తాడో – తన హృదయం సంతృప్తికరమైన విశ్వాసంతో నిండి ఉండి, బలవంతంగా తిరస్కరించేవాడు తప్ప 56 మరియు ఎవరైతే హృదయపూర్వకంగా సత్య- తిరస్కారానికి పాల్పడుతారో, అలాంటి వారిపై అల్లాహ్‌ ఆగ్రహం (దూషణ) విరుచుకు పడుతుంది. మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉంటుంది.


ذَٰلِكَ بِأَنَّهُمُ اسْتَحَبُّوا الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَأَنَّ اللَّـهَ لَا يَهْدِي الْقَوْمَ الْكَافِرِينَ ١٠٧

ఇది ఎందుకంటే! నిశ్చయంగా, వారు పరలోక జీవితంకంటే ఇహలోక జీవితాన్నే ఎక్కువగా ప్రేమించటం మరియు నిశ్చయంగా, అల్లాహ్‌ సత్య-తిరస్కారులకు సన్మార్గం చూపడు.


أُولَـٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّـهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَارِهِمْ ۖ وَأُولَـٰئِكَ هُمُ الْغَافِلُونَ ١٠٨

ఇలాంటి వారి హృదయాల మీదా, చెవుల మీదా మరియు కన్నుల మీదా అల్లాహ్‌ ముద్ర వేసి ఉన్నాడు. 57 మరియు ఇలాంటి వారే నిర్లక్ష్యంలో మునిగి ఉన్నవారు!


لَا جَرَمَ أَنَّهُمْ فِي الْآخِرَةِ هُمُ الْخَاسِرُونَ ١٠٩

నిశ్చయంగా, పరలోకంలో నష్టానికి గురి కాగలవారు వీరే, అని అనటంలో ఎలాంటి సందేహం లేదు.


ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ هَاجَرُوا مِن بَعْدِ مَا فُتِنُوا ثُمَّ جَاهَدُوا وَصَبَرُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ١١٠

ఇక నిశ్చయంగా, నీ ప్రభువు! వారి కొరకు, ఎవరైతే మొదట పరీక్షకు గురిచేయబడి, పిదప (తమ ఇల్లూ వాకిలి విడిచి) వలసపోయి, తరువాత ధర్మపోరాటంలో పాల్గొంటారో మరియు సహనం వహిస్తారో! 58 దాని తరువాత నిశ్చయంగా, అలాంటివారి కొరకు నీ ప్రభువు! ఎంతో క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. (7/8)


يَوْمَ تَأْتِي كُلُّ نَفْسٍ تُجَادِلُ عَن نَّفْسِهَا وَتُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ وَهُمْ لَا يُظْلَمُونَ ١١١

* ఆ దినమును (జ్ఞాపకముంచుకోండి), ఎప్పుడైతే ప్రతిప్రాణి కేవలం తనస్వంతం కొరకే బ్రతిమాలుకుంటుందో! 59 ప్రతి ప్రాణికి దాని కర్మలకు తగిన ప్రతిఫలం ఇవ్వబడుతుంది మరియు వారి కెలాంటి అన్యాయం జరుగదు. 60


وَضَرَبَ اللَّـهُ مَثَلًا قَرْيَةً كَانَتْ آمِنَةً مُّطْمَئِنَّةً يَأْتِيهَا رِزْقُهَا رَغَدًا مِّن كُلِّ مَكَانٍ فَكَفَرَتْ بِأَنْعُمِ اللَّـهِ فَأَذَاقَهَا اللَّـهُ لِبَاسَ الْجُوعِ وَالْخَوْفِ بِمَا كَانُوا يَصْنَعُونَ ١١٢

మరియు అల్లాహ్‌ ఒక నగరపు ఉపమానం ఇస్తున్నాడు: మొదట అది (ఆ నగరం) శాంతి భద్రతలతో నిండిఉండేది. దానికి (దాని ప్రజలకు) ప్రతిదిక్కునుండి జీవనోపాధి పుష్కలంగా లభిస్తూ ఉండేది. తరువాత (ఆ నగరం) వారు అల్లాహ్‌ అనుగ్రహాలను తిరస్కరించారు (కృతఘ్ను లయ్యారు), కావున అల్లాహ్‌ వారి చర్యలకు బదులుగా వారికి ఆకలీ, భయమూ వంటి ఆపదల రుచి చూపించాడు.


وَلَقَدْ جَاءَهُمْ رَسُولٌ مِّنْهُمْ فَكَذَّبُوهُ فَأَخَذَهُمُ الْعَذَابُ وَهُمْ ظَالِمُونَ ١١٣

మరియు వాస్తవంగా వారి వద్దకు వారి (జాతి) నుండి ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు, కాని వారు అతనిని అసత్యవాదుడవని తిరస్క రించారు. కావున వారు దుర్మార్గంలో మునిగి ఉన్నప్పుడు వారిని శిక్ష పట్టుకున్నది.


فَكُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّـهُ حَلَالًا طَيِّبًا وَاشْكُرُوا نِعْمَتَ اللَّـهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ ١١٤

కావున మీరు అల్లాహ్‌నే ఆరాధించేవారైతే, ఆయన మీ కొరకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన, పరిశుధ్ధమైన ఆహారాలనే తినండి మరియు అల్లాహ్‌ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి.


إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ لِغَيْرِ اللَّـهِ بِهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ اللَّـهَ غَفُورٌ رَّحِيمٌ ١١٥

నిశ్చయంగా, ఆయన మీ కొరకు (దానంతట అది) చచ్చినది (పశువు / పక్షి) రక్తం, పందిమాంసం, అల్లాహ్‌ తప్ప ఇతరుల కొరకు (ఇతరుల పేర) జి'బ'హ్‌ చేయబడినది (పశువు / పక్షి మాంసాన్ని) నిషేధించి ఉన్నాడు. కాని ఎవడైనా (అల్లాహ్‌) నియమాలను ఉల్లఘించే ఉద్దేశంతో కాక, (ఆకలికి) తాళలేక, గత్యంతరం లేని పరిస్థితిలో (తింటే); నిశ్చయంగా, అల్లాహ్‌ క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. 61


وَلَا تَقُولُوا لِمَا تَصِفُ أَلْسِنَتُكُمُ الْكَذِبَ هَـٰذَا حَلَالٌ وَهَـٰذَا حَرَامٌ لِّتَفْتَرُوا عَلَى اللَّـهِ الْكَذِبَ ۚ إِنَّ الَّذِينَ يَفْتَرُونَ عَلَى اللَّـهِ الْكَذِبَ لَا يُفْلِحُونَ ١١٦

అల్లాహ్‌ మీద అబద్ధాలుకల్పిస్తూ: ''ఇది ధర్మసమ్మతం, ఇది నిషిధ్ధం.'' అని మీ నోటి కొచ్చినట్లు (మనస్సులకు తోచినట్లు) అబద్ధాలు పలకకండి. నిశ్చయంగా, అల్లాహ్‌పై అబద్ధాలు కల్పించేవారు ఎన్నడూ సాఫల్యం పొందరు.


مَتَاعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ١١٧

దీనితో కొంతవరకు సుఖసంతోషాలు కలుగవచ్చు, కాని వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.


وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا مَا قَصَصْنَا عَلَيْكَ مِن قَبْلُ ۖ وَمَا ظَلَمْنَاهُمْ وَلَـٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ ١١٨

మరియు మేము నీకు ప్రస్తావించిన వాటిని, ఇంతకు ముందు యూదులకు నిషేధించాము. మరియు మేము వారికి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తామే అన్యాయం చేసుకుంటూ ఉండేవారు. 62


ثُمَّ إِنَّ رَبَّكَ لِلَّذِينَ عَمِلُوا السُّوءَ بِجَهَالَةٍ ثُمَّ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا إِنَّ رَبَّكَ مِن بَعْدِهَا لَغَفُورٌ رَّحِيمٌ ١١٩

అయితే నిశ్చయంగా, నీ ప్రభువు – ఎవరైతే అజ్ఞానంలో పాపాలుచేసి, ఆ పిదప పశ్చాత్తాపపడి, సరిదిద్దుకుంటారో – దాని (ఆ పశ్చాత్తాపం) తరువాత (వారిని క్షమిస్తాడు); నిశ్చయంగా, నీ ప్రభువు క్షమించేవాడు, అపార కరుణాప్రదాత.


إِنَّ إِبْرَاهِيمَ كَانَ أُمَّةً قَانِتًا لِّلَّـهِ حَنِيفًا وَلَمْ يَكُ مِنَ الْمُشْرِكِينَ ١٢٠

నిశ్చయంగా, ఇబ్రాహీమ్‌ (ఒక్కడే) అల్లాహ్‌కు భక్తిపరుడై, ఏకదైవ సిధ్ధాంతాన్ని (సత్యధర్మాన్ని) స్థాపించటంలో తనకుతానే ఒక సమాజమై ఉండెను. 63 అతను అల్లాహ్‌కు సాటి కల్పించేవారిలో ఎన్నడూ చేరలేదు.


شَاكِرًا لِّأَنْعُمِهِ ۚ اجْتَبَاهُ وَهَدَاهُ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ ١٢١

ఆయన (అల్లాహ్‌) యొక్క అనుగ్రహాలకు కృతజ్ఞుడై ఉండేవాడు. ఆయన (అల్లాహ్‌) అతనిని (తన స్నేహితునిగా) ఎన్నుకొని, అతనికి ఋజు మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేశాడు.


وَآتَيْنَاهُ فِي الدُّنْيَا حَسَنَةً ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ ١٢٢

మేము అతనికి ఇహలోకంలో మంచి స్థితిని ప్రసాదించాము. మరియు నిశ్చయంగా, అతను పరలోకంలో సద్వర్తనులతో పాటు ఉంటాడు.


ثُمَّ أَوْحَيْنَا إِلَيْكَ أَنِ اتَّبِعْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ ١٢٣

తరువాత మేము నీకు (ఓ ము'హమ్మద్!) ఈ సందేశాన్ని పంపాము: ''నీవు ఇబ్రాహీమ్‌ అనుసరించిన, ఏకదైవ సిద్ధాంతాన్ని (సత్య ధర్మాన్ని) అనుసరించు. అతను (ఇబ్రాహీమ్‌) అల్లాహ్‌కు సాటి కల్పించే వారిలోనివాడు కాడు.''


إِنَّمَا جُعِلَ السَّبْتُ عَلَى الَّذِينَ اخْتَلَفُوا فِيهِ ۚ وَإِنَّ رَبَّكَ لَيَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ ١٢٤

వాస్తవానికి, శనివార శాసనం (సబ్త్‌) విషయంలో అభిప్రాయభేదాలు కలిగి ఉన్న వారికే అది విధించబడింది. మరియు నిశ్చయంగా, నీ ప్రభువు! పునరుత్థానదినమున వారి మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను గురించి తీర్పుచేస్తాడు.


ادْعُ إِلَىٰ سَبِيلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ ۖ وَجَادِلْهُم بِالَّتِي هِيَ أَحْسَنُ ۚ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِمَن ضَلَّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ ١٢٥

(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమ రీతిలో వాదించు 64 నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైనవాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందినవాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు


وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُم بِهِ ۖ وَلَئِن صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِّلصَّابِرِينَ ١٢٦

మరియు మీరు (మీ ప్రత్యర్థులను) శిక్షించ దలచుకుంటే, మీకు జరిగిన దానికి (అన్యాయానికి) సమానమైన శిక్ష మాత్రమే ఇవ్వండి. కాని మీరు సహనంవహిస్తే నిశ్చయంగా, సహనం వహించేవారికి ఎంతో మేలు కలుగుతుంది.


وَاصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِاللَّـهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِي ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ ١٢٧

(ఓ ము'హమ్మద్‌!) నీవు సహనం వహించు మరియు నీకు సహనమిచ్చేవాడు కేవలం అల్లాహ్‌ మాత్రమే. మరియు వారిని గురించి దుఃఖపడకు మరియు వారు పన్నే కుట్రలకు నీవు వ్యాకులపడకు.


إِنَّ اللَّـهَ مَعَ الَّذِينَ اتَّقَوا وَّالَّذِينَ هُم مُّحْسِنُونَ ١٢٨

నిశ్చయంగా, అల్లాహ్‌ భయభక్తులు గల వారితో మరియు సజ్జనులైన వారితో పాటు ఉంటాడు.