అల్‌-మసద్‌: The Palm Fiber, ఖర్జూరపు నార. ఈ సూరహ్‌ మొదటి మక్కహ్ కాలానికి చెందింది. బహుశా అవతరణలో 6వది. దీని ఇతరపేర్లు అల్‌-లహబ్‌ (అగ్నిజ్వాలలు) మరియు తబ్బత్‌ (నాశనమగుట). దీని అవతరణ గురించి ఈ 'హదీస్‌' ఉంది: దైవప్రవక్త ('స'అస)కు తన దగ్గరి వారికి ఇస్లాం ధర్మప్రచారం చేయటానికి ఆజ్ఞ దొరికిన తరువాత, అతను 'సఫా గుట్టపై ఎక్కి: "యా 'సబా'హా!" అంటారు. ఆ కాలంలో ఏదైన ఆపద వస్తే ఇలా అరిచేవారు. అప్పుడు అందరూ అక్కడ సమావేశమవుతారు. అప్పుడతను అంటారు: "ఓ మక్కహ్ వాసులారా: 'ఈ గుట్ట వెనుక ఒక గుర్రాల సైన్యం మీపై దాడిచేయటానికి సిద్ధంగా ఉంది.' అని, నేను అంటే మీరు నమ్ముతారా?" దానికి వారంటారు: "ఎందుకు నమ్మము. నీవు సదా సత్యమే పలికావు!" అతను అంటారు: "అయితే వినండి! ఒకవేళ మీరు షిర్క్‌ మరియు కుఫ్ర్‌ విడువకుంటే మీపై ఘోరశిక్ష పడనున్న దని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." అది విని అబూ-లహబ్‌ అంటాడు: "నీవు నాశనమైపోవు గాక (తబ్బన్‌లక)! దీనికేనా నీవు మమ్మల్ని ఇక్కడ జమచేసింది?" అప్పుడు ఈ సూరహ్‌ అవతరింప జేయబడుతుంది, ('స'హీ'హ్‌ బు'ఖారీ). అబూ-లహబ్‌ అసలు పేరు అబ్దుల్‌-'ఉ'జ్జా! తన ఎర్ర రంగు రూపుల వల్ల అబూ-లహబ్‌ అనే మారు పేరుతో పిలవబడ్డాడు. ఇతడు దైవప్రవక్త ('స'అస) పిన్నాన్న. అతని భార్య పేరు ఉమ్మె-జమీల్‌ బిన్తె-'హర్బ్‌. వీరిద్దరు అతని ('స'అస) యొక్క క్రూరమైన విరోధులు. 5 ఆయాతులున్న ఈ సూరహ్ పేరు 5వ ఆయత్‌ లో ఉంది.

بِسْمِ اللَّـهِ الرَّحْمَـٰنِ الرَّحِيمِ

  • 111:1

تَبَّتْ يَدَا أَبِي لَهَبٍ وَتَبَّ ١

అబూ-లహబ్‌ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించిపోవుగాక! 1


  • 111:2

مَا أَغْنَىٰ عَنْهُ مَالُهُ وَمَا كَسَبَ ٢

అతని ధనం మరియు అతని సంపాదన (సంతానం) అతనికి ఏ మాత్రం పనికిరావు!


  • 111:3

سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ ٣

అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చ బడతాడు!


  • 111:4

وَامْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ ٤

మరియు అతని భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 2


  • 111:5

فِي جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍ ٥

ఆమె మెడలో బాగా పేనిన ఖర్జూరపునార త్రాడు (మసద్‌) ఉంటుంది. 3